A9 న్యూస్ ప్రతినిధి:
బీడీ కార్మికుల ఉపాధి భద్రత కోసం, ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఉద్యమించాలని ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ కార్మికులకు పిలుపును ఇచ్చారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ స్వర్ణోత్సవ సంవత్సర ముగింపు సభ భైంసా పట్టణంలో కె.ఎస్ గార్డెన్ లో రాష్ట్ర అధ్యక్షులు సిఎస్ భూమేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ పాల్గొని ప్రసంగిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కోప్టా చట్టం పేరుతో బీడీ పరిశ్రమను దెబ్బతీస్తోందని, ఆయన అన్నారు. బీడీ కార్మికులకు ప్రత్యమ్నయ ఉపాధిని చూపించాలని లేనిచో కార్మికుల కోపాగ్నికి బలికాక తప్పదని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు చట్టాలను తెచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తోందని, దేశంలో 40 కోట్ల మంది కార్మికులకు పి.యఫ్, ఈఎస్ఐ చట్టాలు అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మోడీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు 4000 జీవన మృతిని వెంటనే అమలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షులు బి.భూమన్న, ప్రధాన కార్యదర్శి బి.సూర్య, శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ హరిత, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ లు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి బీడీ కార్మికుల బియ్యపు ఈఎస్ఐ ఆకు, తంబాకు, బట్వాడా శ్రమ దోపిడీకి, వేధింపులకు వ్యక్తి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర యూనియన్ కు ఉందని వారు తెలిపారు. జీవన భృతి అమలు కోసం ఆందోళన చేసి కార్మికుల పక్షాన నిలబడిందని వారు తెలిపారు. సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నిర్మల్ జిల్లా కార్యదర్శి రాజు, యూనియన్ రాష్ట్ర నాయకులు ఖాజా మొయినుద్దీన్, సునాకారి రాజేష్, మాట్లాడారు. సభలో రాష్ట్ర నాయకులు భారతి, గంగాధర్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు, వెంకట్ నారాయణ, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్, రాష్ట్ర కోశాధికారి మల్లన్న, జ్యోతి, అరుణ, రంజిత్, పొశెట్టి తదితరులు పాల్గొన్నారు.