నిజామాబాద్ A9 న్యూస్, జనవరి 29:
నరేంద్ర మోడీ రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా మరియు కార్మిక సంఘాల జేఏసీ 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాపిత సమ్మె, గ్రామీణ బంద్ పిలుపును జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలను కోరారు.
ఆర్మూర్ పట్టణంలో సైదాబాద్ కాలనీ ఐఎఫ్టియు ఆఫీసులో సోమవారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. మోడీ ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించి, భారతదేశ లౌకికతత్వాన్ని
దెబ్బతీస్తున్నారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి, భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఆర్ఎస్ఎస్ ఆదేశాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. దేశాన్ని అప్పులకొంపగా మార్చి, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి, రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను అమలు కోసం దొడ్డి దారిన ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. 140 కోట్ల జనాభా గల భారతదేశంలో
ప్రజల మౌలిక సమస్యలను విస్మరించి, ప్రజల భవిష్యత్తును పక్కకు పెట్టి, మత విద్వేషాలను సృష్టిస్తూ, పాసిస్టు విధానాలను అవలంబిస్తున్నారని ఆయన అన్నారు.
వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కిస్తూ, కార్పొరేట్ అధిపతులు ఆదాని, అంబానీలకు అప్పజెప్పే కుట్రలు చేస్తున్నారని దాసు అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే నిర్బంధించడం, దాడులు చేయడం సాధారణమైపోయిందని ఆయన తెలిపారు. మతం వ్యక్తిగతమైన అంశమని, కానీ రాజకీయాలలో మిళితం చేసి, లబ్ది పొందడానికి కుట్రలు చేస్తున్నారని, ప్రజాస్వామ్య విలువల్ని పాతరెస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
మోడీ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ బంద్, సమ్మెలో ప్రజలు పాల్గొనాలని దాసు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బి సూర్య శివాజీ, ఎండి కాజా మొయినుద్దీన్, వి బాలయ్య, పి.మార్క్స్, అబ్దుల్, బి ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.