గణనాథుడి నవరాత్రుల పండుగొస్తున్నది. ఉత్సవ కమిటీలు ఇప్పటికే గణపయ్యను ప్రతిష్ఠించే వేదికలను సిద్ధం చేస్తుండగా.. మరోవైపు తాము నిలబెట్టే వినాయకుడిని కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
- పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే మేలు
- పీవోపీ గణనాథులతో నీరు, వాతావరణం కలుషితం
- ఖమ్మంలో విక్రయానికి కోల్‌కతా నుంచి మట్టి ప్రతిమలు
- అరడుగు నుంచి 10 అడుగుల వరకు మట్టితోనే..
- కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఉత్సవ కమిటీలు
రఘునాథపాలెం, సెప్టెంబర్ 12 : గణనాథుడి నవరాత్రుల పండుగొస్తున్నది. ఉత్సవ కమిటీలు ఇప్పటికే గణపయ్యను ప్రతిష్ఠించే వేదికలను సిద్ధం చేస్తుండగా.. మరోవైపు తాము నిలబెట్టే వినాయకుడిని కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో నిత్య పూజలు చేసి.. తర్వాత నీటిలో నిమజ్జనం చేసే రంగు రంగుల వినయకుడి ప్రతిమ పర్యావరణానికి హాని కలిగిస్తుందా..? అనే విషయాన్ని మాత్రం ఉత్సవ కమిటీలు ఆలోచన చేయలేకపోతున్నాయి. తీరొక్క రూపాలతో తయారైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.
దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందనే ఆలోచన మాత్రం చేయడం లేదు. ఏటా ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు మట్టి విగ్రహాల వినియోగంపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొందరు మాత్రమే ఆ నిబంధనలను పాటిస్తూ పర్యావరణ పరిరక్షకులుగా మిగిలిపోతున్నారు. మట్టితో తయారైన విగ్రహాలు చిన్నగా ఉంటాయనే ఆలోచనతో ఉత్సవ కమిటీలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన పెద్ద పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. విగ్రహం ఎంత పెద్దది అనేది కాదు.. మట్టితో తయారైనదా.. లేదా.. అనే ఆలోచనతో మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని పర్యావరణ పరిరక్షకులు కోరుతున్నారు.
ఆకట్టుకుంటున్న మట్టి విగ్రహాలు
ఖమ్మంలోని బ్యాంక్ కాలనీలో గల టీడీపీ ఆఫీస్ ఎదుట అమ్మకానికి పెట్టిన వినాయక మట్టి విగ్రహాలు నగర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఒండ్రు, నల్ల రేగడి(బంక మట్టి)తో తయారైన విగ్రహాలు అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. నిత్యం సర్దార్ పటేల్ స్టేడియం వద్ద ప్రమిదల విక్రయాలు జరిపే వ్యాపారి దునుకు నర్సింహారావు ఏడేళ్లుగా కోల్‌కతా నుంచి మట్టి విగ్రహాలను ఖమ్మానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. కొద్ది రోజులుగా మట్టి విగ్రహాలకు వాటర్ రంగులు అద్దే పనిలో వ్యాపారి నిమగ్నమయ్యాడు. అరడుగు నుంచి 10 అడుగుల విగ్రహాల వరకు పూర్తిగా మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలే అక్కడ కనిపిస్తాయి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో హాని..
ఏకదంతుడి విగ్రహాల తయారీలో ఉపయోగించే ప్రమాదకరమైన రసాయన రంగులు పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ)తో విగ్రహాల తయారీ సులభంగా ఉండటం, వివిధ రూపాల్లో అందంగా మలిచే సౌకర్యం, వేగంగా రూపొందించే సౌలభ్యం ఉండడం వల్ల ఎక్కువగా వీటి తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. విగ్రహాల తయారీలో నైపుణ్యం ఉన్న రాజస్థాన్ వాసులు మన ప్రాంతానికి వచ్చి ఉపాధి పొందడంతోపాటు భారీగా విగ్రహాలను తయారు చేస్తున్నారు. విగ్రహాలు అందంగా కనిపించడానికి రసాయనాలతో మిళితమై ఉన్న రంగులు, చెమ్కీలు, థర్మాకోల్ ముక్కలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా నిమజ్జనం తర్వాత చెరువు లేదా నదిలోని నీరంతా కలుషితం అవుతుంది. ఈ నీటిని తాగితే పశుపక్షాదులు జబ్బున పడడంతోపాటు మృతి చెందే ప్రమాదం ఉంది. ఆ నీటితో పంటలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాలను పూజించేలా ప్రజలను మేల్కొలుపుదామని పర్యావరణ పరిరక్షకులు అంటున్నారు.
ఏడేళ్లుగా మట్టి విగ్రహాలే అమ్ముతున్నా..
పర్యావరణ పరిరక్షణ కోసం బాధ్యతగా ఏడేళ్లుగా మట్టి విగ్రహాలనే విక్రయిస్తున్నా. పర్యావరణ పరిరక్షకులు సైతం ఏటా గోదాంకు వచ్చి నా దగ్గరే కొనుగోలు చేస్తున్నారు. 9 రకాల మోడళ్లతో ఏడు అడుగుల వరకు ఉత్సవ కమిటీల కోసం విగ్రహాలను తీసుకొచ్చా. తక్కువ లాభం వచ్చినా మట్టి విగ్రహాలకే ప్రాముఖ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అమ్ముతున్నా. చవితి రోజు మహిళలు ఇళ్లలో పూజించే చిన్న చిన్న మట్టి విగ్రహాలు సైతం గోదాంలో అందుబాటులో ఉంచాను.
– దునుకు నర్సింహారావు, మట్టి వినాయక విగ్రహాల వ్యాపారి, బ్యాంక్ కాలనీ, ఖమ్మం