*సమస్యను ఆదిలోనే గుర్తిస్తే సమానత్వం సాధ్యం.
*హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్.
హైదరాబాద్, జూలై 4: నాగరికత పెరుగుతున్నప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్నదని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళల పట్ల ఎకడ వివక్ష ఉందో ఆదిలోనే గుర్తించి దానిని రూపుమాపినప్పుడే సమానత్వం సాధ్యమవుతుందని చెప్పారు. జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ఇంటర్నల్ కంప్లెయింట్ కమిటీ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం బహుమతులను ప్రదానం చేసింది.
ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ సుజయ్‌పాల్ ప్రసంగిస్తూ.. పురాణాల్లో మహిళలను పూజించిన చోట దేవతలు ఉంటారన్నది ఆచరణలో ఉండి ఉంటే మహిళల రక్షణ కోసం సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం, లోక్‌సభ చట్టాలు చేయడం అవసరమై ఉండేది కాదని అన్నారు. దేశంలోని పలు కింది కోర్టుల్లో మహిళలు 50 నుంచి 60% వరకు ఉన్నారని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో 70 శాతానికి చేరారని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని కోర్టుల్లో 33% రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇప్పుడు అక్కడ పురుషులకు రిజర్వేషన్లు కల్పించాలనే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్, జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ టీ మాధవీదేవి, జస్టిస్ జువ్వాడి శ్రీదేవి, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు.