ఆర్మూర్‌లో కాంగ్రెస్–బీజేపీ మధ్య హై టెన్షన్….

On: Monday, July 20, 2026 12:25 PM

 

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది.

కాంగ్రెస్ నాయకుల ప్రకారం, ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన రూ.1కే వైద్యం, ప్రతి గ్రామంలో పేదలకు 10 ఇళ్లు, ఏడాదిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని చేసిన హామీలు నెరవేరలేదని ఆరోపించారు.

దీనిపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వీడియో విడుదల చేసి, తన ఇంటి ముట్టడిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “నా ఇంటిని ముట్టడించే స్థాయి మీది కాదు. అలాంటి చర్యలు ముఖ్యమంత్రి లేదా మంత్రుల స్థాయి నాయకులు చేయాలి” అని వ్యాఖ్యానించారు.

ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (IPS) ఆదేశాల మేరకు అంకాపూర్, ఆర్మూర్ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. శాంతిభద్రతల కోసం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచగా, కాంగ్రెస్ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీఐ సత్యనారాయణ గౌడ్ పర్యవేక్షణలో పోలీసులు పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నారు. ఐదుగురికి మించి గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.

21 Jul 2026

Leave a Comment