సిరికొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య.

On: Wednesday, July 1, 2026 6:37 AM

ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలి..

* ⁠పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలి..

A9 news నిజామాబాద్:

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిరికొండ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ మంగళవారం వార్షిక తనిఖీ (ఇన్‌స్పెక్షన్) నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడం ప్రతి అధికారి బాధ్యత అని, ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించాలని, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు.

స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు పోలీస్ అధికారులు, సిబ్బంది గౌరవ వందనం అందించగా, ఆయన వందనాన్ని స్వీకరించి మొక్క నాటారు. అనంతరం స్టేషన్‌లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

సిబ్బందికి అందుబాటులో ఉన్న కిట్ ఆర్టికల్స్, భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణను పరిశీలించి తగిన సూచనలు చేశారు. రిసెప్షన్ సెంటర్‌ను సందర్శించి ఫిర్యాదుల నమోదు విధానం, నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిని గౌరవంగా ఆహ్వానించి, వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు.

అనంతరం కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ తదితర అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (ప్లాన్ ఆఫ్ యాక్షన్) రూపొందించి నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సబ్ ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు.

స్టేషన్‌లో అమలవుతున్న “5ఎస్ విధానం”ను సమీక్షించిన కమిషనర్, మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం కోసం వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని తెలిపారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల డిజిటల్ నిర్వహణ, సిబ్బంది హాజరు, డ్యూటీ విధానాలపై ఆరా తీసి, క్రమశిక్షణతో, పారదర్శకంగా సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని సూచించారు.

సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు, కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయాలని సూచించారు.

సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారులపై నిఘా మరింత పటిష్టం చేయాలని, ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమింగ్ యాప్‌ల మోజులో పడి యువత సైబర్ మోసగాళ్ల బారిన పడుతున్నారని, ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే డ్రగ్స్ నిర్మూలన కోసం గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను చైతన్యవంతులను చేయాలని ఆదేశించారు.

సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది 24×7 హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు తగ్గించాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు.

ఈ తనిఖీలో నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాష్ యాదవ్, ధర్పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. బిక్షపతి, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ బి. అంజయ్య, సిరికొండ సబ్ ఇన్‌స్పెక్టర్ జె. రామకృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

01 Jul 2026

Leave a Comment