బాల్కొండ, ఆగస్ట్ 22, 2025:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంకు చెందిన పేద కుటుంబాలు ఈరోజు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అన్యాయంపై రాస్తారోకో నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకూ ఇండ్ల కేటాయింపు జరిగినట్టు వారు ఆరోపించారు. ప్రస్తుతం మిగిలి ఉన్న ఇళ్లను అర్హులైనవారికే కేటాయించాలి అని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో కొంతమంది నాయకుల అలసత్వం, మతి తప్పిన వైఖరి వలన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అవినీతి, జాప్యం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇండ్లు కేటాయించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన జరగాలని, ఇతర నాయకుల పారవీలకు తావు లేకుండా చూడాలని నిరసనకారులు స్పష్టం చేశారు.
“మాకు న్యాయం జరగకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం,” అని వారు హెచ్చరించారు.
ఈ రాస్తారోకో కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ షేరు, పఠాన్ సల్మాన్ ఖాన్, ఇతర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ ఆక్రోశాన్ని వ్యక్తపరిచారు.







