ఖమ్మం: జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని.. అభివృద్ధి మాత్రం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే నిధులతో ఖమ్మం జిల్లాలో కోట్లాది రూపాయల అభివృద్ధి జరుగుతోందని ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఏ ఎన్నికలైనా బీజేపీ అభ్యర్థులదే విజయమని జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల గడ్డ కాదని.. ఇకపై బీజేపీ అడ్డా కాబోతోందని ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో చాలామంది కమ్యూనిస్టులు తనకు టచ్‌లో ఉన్నారని తెలిపారు. కమ్యూనిస్టులు బీజేపీలోకి రావాలని స్వాగతం పలికారు. ఇవాళ(మంగళవారం) ఖమ్మం జిల్లాలో రామచంద్రరావు పర్యటించారు. ఖమ్మం నగరంలో రామచంద్రరావు రోడ్ షో నిర్వహించారు. నగరంలోని సప్తపది ఫంక్షన్ హాల్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అందజేస్తున్న యూరియా లెక్కలకు సంబంధించి రేవంత్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని రామచంద్రరావు ఆరోపించారు. తెలంగాణకు ఖరీఫ్ సీజన్‌కు ఇప్పటివరకు 6.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్రప్రభుత్వం అందజేసిందని స్పష్టం చేశారు. ఇంకా ఎంత యూరియా కావాలంటే అంత ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. రబీ సీజన్ 2004-2005లో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని… కానీ తెలంగాణలో 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడు యూరియా లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. రబీలో అదనంగా ఉన్న యూరియా ఇప్పుడు ఎందుకు లేకుండా పోయిందని.. ఎందుకు కొరత వచ్చిందో రేవంత్ ప్రభుత్వం పరిశీలించుకోవాలని సూచించారు. రాజకీయాల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చెప్పింది తప్పయితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని.. మీది తప్పు అయితే మీరు రాజీనామా చేస్తారా అని తుమ్మలకు సవాల్ చేశారు. తుమ్మల తనకు మిత్రులే అది తర్వాత సంగతి అని చెప్పుకొచ్చారు రామచంద్రరావు.
బీసీ రిజర్వేషన్ విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని రామచంద్రరావు నొక్కిచెప్పారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఏ పార్టీలో అయినా ఆ పార్టీ నాయకుడు లేదా ముఖ్యమంత్రి స్థాయి నేతలు ఆయా రాష్ట్రాల్లో పాదయాత్రలు చేస్తారని.. కానీ కాంగ్రెస్‌లో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ జయంతి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో అర్థమవుతోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ది బీసీ రిజర్వేషన్ కాదని.. ముస్లింల రిజర్వేషన్ అని ఆరోపించారు. కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందని విమర్శించారు. తాము ముస్లింల రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు. ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఖమ్మం, నల్గొండ బ్యాచ్ ముఖ్యమంత్రిని సరిగా పని చేయనీయటం లేదని రామచంద్రరావు విమర్శలు చేశారు..