11 ఏళ్ల మోదీ పాలనలో బీసీలకు ఏం చేశారని మాజీ ఎంపీ వీ.హనుమంత్ రావు ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్‌లో మీడియాతో హనుమంత్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తొలి ఏకాదశి, పీర్ల పండగ శుభాకాంక్షలు తెలిపారు. మూడుసార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీనీ కలసి.. బీసీలకు వేర్వేరుగా మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని కోరామని గుర్తుచేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఓబీసీలను పైకి తీసుకురావడానికి కర్ణాటకలో ఈ నెల(జులై) 15వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తనకు ఆహ్వానం పంపారని గుర్తుచేశారు హనుమంత్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎందుకు రైల్‌రోకో చేస్తుందో అర్ధం కావడం లేదని హనుమంత్ రావు విమర్శించారు. తాము 42శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే కవిత అప్పుడు రైల్ రోకో చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక న్యాయ సమరభేరి సభ విజయవంతం అయిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారని అన్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం కష్టపడిన వాళ్లకు పదవి ఇవ్వాలని పీఏసీ సమావేశంలో చెప్పారని హనుమంత్ రావు పేర్కొన్నారు..