నిజామాబాద్, జూలై 16 :
నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11.05 గంటలకు డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్ కు చేరుకున్న గవర్నర్ ను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.

రాజ్యసభ సభ్యులు కేఆర్. సురేష్ రెడ్డి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి తదితరులు గవర్నర్ కు సాదర స్వాగతం పలికారు.
పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, బెటాలియన్ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్నతాధికారులతో కలిసి గవర్నర్ మొక్కలు నాటారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రత్యేక కాన్వాయ్ లో గవర్నర్ తెలంగాణ విశ్వ విద్యాలయానికి చేరుకుని, స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.
గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.