నేడు సామాజిక న్యాయ సమరభేరి సభ.:

On: Friday, July 4, 2025 8:36 AM

 

*’జై బాపూ-జై భీమ్‌-జై సంవిధాన్‌’లో భాగంగా ఎల్బీ స్టేడియంలో.

*నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడ.

*పార్టీ గ్రామ శాఖల అధ్యక్షుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు హాజరు.

40 వేల మందిపైగా వచ్చే అవకాశం.

ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న ఖర్గే.

స్వాగతం పలికిన ముఖ్యమంత్రి, మంత్రులు, టీపీసీసీ నేతలు.

నేడు పీఏసీ, టీపీసీసీ విస్తృత కార్యవర్గ భేటీలు.. పాల్గొననున్న ఖర్గే.

హైదరాబాద్‌/శంషాబాద్‌, జూలై 4 సామాజిక న్యాయ సమర భేరి పేరిట టీపీసీసీ తలపెట్టిన సభకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించనున్న సభకు టీపీసీసీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మందికి పైగా ఉన్న పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని జిల్లాలు, మండల కమిటీల కార్యవర్గ సభ్యులు, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు.. వెరసి మొత్తం 40 వేలమంది పైగా నేతలు, కార్యకర్తలు సభకు హాజరు కానున్నారు. జై బాపూ-జై భీమ్‌-జై సంవిధాన్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల అధ్యక్షులకు భవిష్యత్తు కార్యాచరణపై నేరుగా దిశానిర్దేశం చేస్తారు. ఖర్గేతో పాటు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ కూడా మాట్లాడనున్నారు. వీరితో పాటు పలువురు గ్రామ, మండల కమిటీల అధ్యక్షులూ ప్రసంగించనున్నారు.

సభకు నియోజకవర్గానికి 500 మంది చొప్పున గ్రామ కమిటీల అధ్యక్షులు.. జిల్లా, మండల కార్యవర్గ సభ్యులను తరలించేందుకు ఇన్‌చార్జి మంత్రుల పర్యవేక్షణలో ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి సాధారణ విమానంలో హైదరాబాద్‌ వచ్చిన ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌, మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, పొంగులేటి, దామోదర, పొన్నం ప్రభాకర్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్‌ విమానాశ్రయంలోని వీవీఐపీ లాంజ్‌లో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి తదితరులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌కు వచ్చిన ఖర్గే.. రాత్రి అక్కడే బస చేశారు. పలువురు ముఖ్య నాయకులతో ఆయన ముఖాముఖీ సమావేశాలు నిర్వహించారు. ఖర్గే రాక సందర్భంగా శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా భేటీల్లోనూ పాల్గొననున్న ఖర్గే.. ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగే సామాజిక న్యాయ సమరభేరి సభలో పాల్గొంటారు.

*ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు సీతక్క, పొన్నం.

హైదరాబాద్‌ సిటీ: ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను గురువారం సాయంత్రం మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా, సభకు వచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. స్టేడియంలో వేదికకు, ప్రతినిధులకు వేర్వేరుగా ప్రత్యేక షామియనాలు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా సభకు ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఎల్బీ స్టేడియం చుట్టూ పలువురు నేతలు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. సభకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల నుంచే దాదాపు 25వేల మంది ప్రతినిధులను తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.

23 Jul 2025

Leave a Comment