వరంగల్ జిల్లా: డిసెంబర్05
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈరోజు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం లో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంట లకు నర్సంపేట నియోజ వర్గానికి చేరుకోనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలో పర్యటిస్తున్న నేపథ్యంలో రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.కాగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు.
నర్సంపేటలో జరిగే ప్రజా పాలన విజయోత్సవ సభ గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల గెలుపునకు దోహదపడుతుందనే దీమాతో ఉన్నారు. సభ ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు పలు కీలక హామీలు ఇవ్వడంతో పాటు పూర్తిస్థాయిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడే అవకాశం ఉండటంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి కలిసి వస్తుందని భావిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కీలక స్థానాలన్నీ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. మళ్లీ అదే తీరులో సర్పంచ్, వార్డు పదవులను కైవసం చేసుకునేలా పావులు కదుపుతూ సీఎం సభ విజయవంతం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతలు హాజరవడంతో పాటు…..
సభను తమకు అనుకూ లంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ సభకు హాజరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సభలో సీఎం చేసే ప్రకటనలు గ్రామాల్లో ప్రతిఒక్కరికీ తెలిసేలా జాగ్రత్త పడుతున్నారు.








