మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని ఆర్ పోలంపల్లి గ్రామానికి చెందిన పులిమామిడి ఉదయ్ కిరణ్ దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం అతని తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు అతనిపై పడ్డాయి. తల్లి శివలక్ష్మితో కలిసి జీవిస్తున్న ఉదయ్ కిరణ్‌కు నడవలేని పరిస్థితి ఉంది.
ఆరు సంవత్సరాల క్రితం ప్రభుత్వం అతనికి మూడు చక్రాల బండి (ట్రైసైకిల్) అందజేసింది. అయితే ప్రస్తుతం ఆ బండి పూర్తిగా చెడిపోయిన స్థితిలో ఉంది. దానిని తరచూ మరమ్మతులు చేయించుకుంటూ ఉపయోగిస్తున్నానని, కొత్త బండి కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పందన లభించలేదని ఉదయ్ కిరణ్ వేదన వ్యక్తం చేశాడు.
తనలాంటి వికలాంగులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించి, కొత్త ట్రైసైకిల్ మంజూరు చేయాలని ఉదయ్ కిరణ్ కోరుతున్నాడు. గ్రామస్థులు కూడా సంబంధిత అధికారులు స్పందించి సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.








