మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం శంకరంపేట నగల కేసులో పోలీసులు సత్వర స్పందన చూపించారు. ఫిర్యాదు అందిన నాలుగు గంటల వ్యవధిలోనే పోగొట్టుకున్న బంగారు గొలుసును రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు.
అల్వాల్‌కు చెందిన ఓ మహిళ గౌరపల్లి చౌరస్తాలో కారులో నుంచి దిగుతున్న సమయంలో బంగారు చైన్ ఉన్న పర్సును పోగొట్టుకుంది. ఈ ఘటనపై ఆమె గురువారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు ఫలితంగా నాలుగు గంటల్లోనే పోగొట్టుకున్న బంగారు గొలుసును గుర్తించి, బాధితురాలికి అప్పగించారు.
పోలీసుల వేగవంతమైన చర్యపై స్థానికులు అభినందనలు తెలిపారు.








