ఎర్గట్ల సెప్టెంబర్ 15:
తాళ్ల రాంపూర్ గ్రామంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని గౌడ కులస్తులు మరియు విడీసీ సభ్యుల మధ్య ఈత, తాటి చెట్ల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. గ్రామస్తులు గౌడ కులస్తులపై దాడి చేయడంతో, సుమారు 30 మంది గౌడ కులస్తులు ప్రాణ భయంతో సంఘ భవనంలో గడియ పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
తాము గ్రామస్తుల నుండి ప్రాణహానికి గురయ్యే పరిస్థితి నెలకొన్నదని, వెంటనే రక్షణ కల్పించాలంటూ బాధితులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల గ్రామంలో వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది.
ఈ ఉద్రిక్తతలో, న్యూస్ కవరేజ్ కోసం గ్రామానికి వెళ్లిన విలేకరులపై విడీసీ సభ్యులు దాడి చేసినట్లు సమాచారం. దీని కారణంగా పరిస్థితి మరింత గందరగోళానికి దారి తీసింది. సంఘటనపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మీడియాపై దాడులను ఖండించారు.
గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసులు తరలివచ్చి మొహరించారు. ఏ చిన్న ఘర్షణ జరగకుండా పరిస్థితిని శాంతింపజేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
విశేషమేమంటే, కేవలం నెల రోజుల క్రితమే జిల్లా జడ్జి, జిల్లా సీపీ ఆధ్వర్యంలో గ్రామంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ పరిస్థితి తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది.
గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే వరకు పోలీసులు గ్రామంలో కొనసాగుతారని అధికారులు తెలిపారు.






