హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ దాసరి హరిచందన, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మెట్రో వాటర్ వర్క్స్, ట్రాఫిక్ తదితర అధికారులకి కీలక సూచనలు చేశారు.
నగరంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లో ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఏస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని మరోసారి అలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
భారీ వర్షసూచన..
కాగా, భాగ్యనగరానికి వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది. భారీ వర్షం నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలని ఐటీ కంపెనీలను కోరారు పోలీసులు.
హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద..
మరోవైపు.. హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్‌కు భారీగా వరద చేరుకుంది. జీడిమెట్ల, కూకట్‌పల్లి, పికెట్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513. 34 మీటర్లుగా ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరువలోకి హుస్సేన్ సాగర్ చేరుకుంది. తూముల ద్వారా నీటిని వదులుతున్నారు అధికారులు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది..