ఎ9 న్యూస్, సంగారెడ్డి | సెప్టెంబర్ 2
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో సంగారెడ్డిలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించబడింది.
గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు “స్కాలర్‌షిప్ బిక్ష కాదు – మా హక్కు” అంటూ నినాదాలు చేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ.8,158 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్, కార్యదర్శి టీ రాజేష్ మాట్లాడుతూ, గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన నిధులను ఇతర పథకాలకే మళ్లించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని విమర్శించారు.
విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, ఫీజులు చెల్లించక పోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు చదువును మానేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆర్థిక పరిస్థితులు బాగోలేవని చెబుతూనే ఎమ్మెల్యేలు, మంత్రులకు జీతాలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు హరివిల్లు మేఘాల్లో కూరుకుపోతోందని, వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే మంత్రుల గడపల దాకా పోరాటాన్ని ముమ్మరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పావని, శ్రావణి, జి శంకర్, అభి, చిన్న, సందీప్, రజనీకాంత్, రిషి, మార్కస్, సిద్దు, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.