ఈనెల 19 నుంచి ఏప్రిల్ 02 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు….

On: Saturday, March 7, 2026 8:54 PM

 

ఆన్లైన్లో భక్తులకు టికెట్ బుకింగ్ సౌకర్యం…

హైదరాబాద్:మార్చి 07:

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈనెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

ఇందులో బాగంగా ఈనెల 27వ తేదీన స్వామివారి కల్యాణం, 28వ తేదీన పట్టాభిషేకం మహోత్సవం జరపనున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గతం కంటే ఘనంగా ఈసారి ఉత్సవాలను నిర్వహిం చేందుకు దేవాదాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, ఈ ఉత్సవాలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌ లో భద్రాచలంలోని కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు దేవస్థానం ఈవో దామోదర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 27వ తేదీన భద్రాచలం దేవస్థానం నందు జరిగే సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించడానికి ఏర్పాటు చేసిన వివిధ సెక్టార్లకు సంబంధించిన టికెట్లను శనివారం నుంచి అందుబాటులో ఉంచారు. దేవస్థానం వెబ్‌సైట్ https://bhadradritemple.telangana.gov.in ద్వారా ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని దేవస్థానం అధికారులు తెలిపారు.

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులు ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ ఉదయం 6గంటల వరకు తానీషా కల్యాణ మండపంలోని సీఆర్‌వో కార్యాలయంలో సంప్రదించి ఒరిజినల్ టికెట్లు పొందవచ్చునని ఆలయ అధికారులు తెలిపారు.

27వ తేదీన సీతారాముల కల్యాణోత్సవం ను వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో సెక్టార్లను ఏర్పాటు చేశారు. సెక్టార్లలోకి ప్రవేశం కోసం రూ.7,500 టికెట్ ద్వారా ఇందులో ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. రూ.2,500, రూ.2,000, రూ. వెయ్యి, రూ. 300, రూ.150 టికెట్లతో పాటు 28వ తేదీన పట్టాభిషేకం కోసం ఒక్కొక్కరికి రూ.1,500, రూ.500, రూ.100 ధరల తో టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసు కునే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.

భద్రాచలం రాలేనివారు పరోక్షంగా తమ గోత్రనామాలతో కల్యాణం జరిపించుకునే వెసులు బాటు కూడా కల్పిస్తున్నారు. ఇందుకోసం రూ.5వేలు, రూ.1,116ల టికెట్లను సైతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అలాగే ఈనెల 15వ తేదీ నుంచి భద్రాచలంలోని ఆలయం వద్ద, తనీషా కల్యాణ మండపం, బ్రిడ్జి పాయింట్ సీఆర్‌వో ఆఫీస్, సబ్ కలెక్టర్ కార్యాలయంలో కౌంటర్ల ద్వారా టికెట్లు విక్రయించడం జరుగుతుందని చెప్పారు.

సీతారాముల కల్యాణో త్సవం సందర్భంగా గతేడాది సుమారు 4లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను విక్రయించగా.. ఈ ఏడాది ఐదు లక్షలకు తగ్గకుండా వీటిని తయారు చేయాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 2లక్షల చిన్న లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. రూ. 100 విలువైన 400 గ్రాముల మహా లడ్డూలు 3వేలకుపైగా సిద్ధం చేస్తున్నారు.

ఈనెల 27వ తేదీన జరిగే శ్రీరామనవమి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. 28న శ్రీరాముడి పట్టాభిషేకం కార్యక్రమంకు ఆనవాయితీ ప్రకారం కొత్తగా వచ్చిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ను ఆలయ అధికారులు ఆహ్వానించనున్నారు.

07 Mar 2026

Leave a Comment