ఆర్మూర్, నవంబర్ 10:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామం సోమవారం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. గ్రామ వీడిసి ఆధ్వర్యంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
గోదావరి తీరం వద్ద గల పవిత్ర శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో కార్తీక మాసంలోని మూడవ సోమవారం సందర్భంగా పరమేశ్వరునికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రమేష్ పంతులు ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా సాగింది.
ఈ సందర్భంగా అందాపూర్ అగ్గు స్వామి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి భక్తి భావంతో తాము తేలిపోయారు.
కళ్యాణం అనంతరం వీడిసి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో దాదాపు ఐదు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. తినుబండారాలు, పిల్లల ఆట వస్తువులు, అలంకరణలతో గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సింగిరెడ్డి మోహన్ రెడ్డి, వీడిసి సభ్యులు నూతికట్టు గంగామోహన్, చామంతి నీలాచారి, బుద్ధుల నల్లన్న, సుంకరి నరసయ్య, అల్లం నరేష్, చత్రపతి, బైరి మోహన్, బాక నరేష్, గజ్రాల గంగాధర్, మేదరి బచ్చన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.







