ప్రతి శనివారం పోలీస్ పరేడ్.
లెఫ్ట్.. రైట్ అంటూ కదం తొక్కుతున్న పోలీసన్నలు.
సరిపోదా శనివారం.. ఇదేదో నాని సినిమాలే అనిపిస్తుంది కదూ.. కానీ ఇది సినిమా కాదు పోలీసుల విధి నిర్వహణలో భాగం. ప్రతి శనివారం ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో పోలీసులు ఈ పరేడ్ ను నిర్వహిస్తున్నారు. తాజాగా శనివారం తెల్లవారుజామున పట్టణంలో షాద్ నగర్ తో పాటు కేశంపేట, చౌదరిగుడా, కొందుర్గు మండలాల పోలీసులతో కలిసి ఈ పరేడ్ నిర్వహించారు. ప్రజలను నిత్యం కాపాడే పోలీసులు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేలా, విధినిర్వహణలో క్రమశిక్షణ దేహదారుఢ్యంతో నిత్యము ఉత్సాహంతో పని చేసేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆసక్తికరంగా కొనసాగుతోంది. షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసిపి) ఎస్ లక్ష్మీనారాయణతో సహా పట్టణ సిఐ విజయకుమార్, ఎస్సైలు రవీందర్ నాయక్, విజయ్, శరత్, సుశీల, నారాయణరెడ్డి తదితర పోలీసు స్టేషన్ల సిబ్బంది గ్రౌండ్ లో కసరత్తులు చేస్తూ కనిపించారు. మార్నింగ్ వాక్ తో పాటు పరేడ్ చేస్తూ పౌరులకు కనిపించారు.
*కొత్త ఉత్సాహంతో..
పోలీసులు నిరంతరం కొత్త ఉత్సాహంతో ఉండాలి. చురుకుగా పనిచేయాలి. అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రతి శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నట్లు ఏసిపి లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే పోలీసులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజలలో కూడా తమకు పోలీసులు అండగా ఉన్నారు అన్న ధైర్యాన్ని పెంచుతాయని స్పష్టం చేశారు. అందుకే క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం ఈ పరేడ్ కొనసాగుతుందని పోలీసుల ఆరోగ్యరీత్యా అదే విధంగా క్రమశిక్షణ తదితర అంశాలు దోహదపడతాయని సిఐ విజయ్ కుమార్ ప్రభాతవార్త ప్రతినిధితో తెలిపారు. కొందుర్గు ఎస్సై రవీంద్రనాయక్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు పోలీసులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని, మనోధైర్యం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. నాలుగు మండలాల పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేరస్తుల పాలిట సింహ స్వప్నాలైన పోలీసులకు అసాంఘిక శక్తుల ఆటలు కట్టించేందుకు వారంలో ఒకరోజు సరిపోదా శనివారం..