హైదరాబాద్: బోరబండ పోచమ్మ బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతీ ఇవాళ(ఆదివారం) పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలను విజయశాంతి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు విజయశాంతిని ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోరాటాలు చేసి తీసుకువచ్చిన ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ అని అభివర్ణించారు. కొన్ని దుష్టశక్తులు తెలంగాణ లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు విజయశాంతి.
తెలంగాణ అనేది అక్షయపాత్ర అని ఉద్ఘాటించారు. తెలంగాణని దోచుకోడానికి మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. ప్రతి ఒక్కరూ ధర్మం వైపు నడవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని.. దుష్ట శక్తులు మాట్లాడేవి పట్టించుకోవద్దని చెప్పుకొచ్చారు. ప్రజల గుండెల్లో తెలంగాణ ఉందని నొక్కిచెప్పారు. ఎవరిని రాష్ట్రంలోకి రానివద్దని ఎమ్మెల్సీ విజయశాంతి కోరారు..