స్థానిక పోరులో రిజర్వేషన్ల ఖరారు…..

On: Wednesday, September 24, 2025 7:36 AM

 

రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామపంచాయతీల్లో దాదాపు 5,360 గ్రామపంచాయతీలు, 1,12,534 వార్డులకుగాను సుమారు 47,264 వార్డులు బీసీలకు దక్కే అవకాశం కనబడుతోంది.ఇక 5,765 ఎంపీటీసీల్లో దాదాపు 2,421 ఎంపీటీసీలు, 565 ఎంపీపీ, జడ్పీటీసీలకు గాను సుమారు 237 చొప్పున కేటాయింపు జరగనున్నాయి. 31 జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాల్లో బీసీలకు దాదాపు 13వరకు స్థానాలు దక్కవచ్చని అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.నేటి సాయంత్రానికి సర్కారుకు నివేదికలు వార్డు సభ్యుడి నుంచి జడ్పీ చైర్‌పర్సన్‌ దాకా తేలిన రిజర్వేషన్లు వాటి ప్రకారం 42శాతంతో రిజర్వేషన్లను ప్రకటించనున్న సర్కార్‌ అంతకుముందు ప్రత్యేక జీవో విడుదలఎన్నికలకు వెళ్లనున్నామని తెలుపుతూ ఎలక్షన్‌ కమిషన్‌కు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం.దసరాలోపే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు అవకాశం.

_హైదరాబాద్‌, సెప్టెంబరు 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల వ్యవహారం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా వార్డు సభ్యుడి నుంచి జడ్పీ చైర్‌పర్సన్‌ వరకు అమలుచేయాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని జిల్లాల కలెక్టర్లు, సిబ్బంది తేల్చారు. ఖరారు చేసిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రాఽథమిక వివరాలను పలు జిల్లాలు ప్రభుత్వానికి పంపాయి. రిజర్వేషన్ల ఖరారుకు రెండ్రోజుల సమయమే ఇవ్వడంతో తప్పు, ఒప్పులను సరిచూసుకునేందుకు మరొకరోజు అదనంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దాని ప్రకారం ఖరారైన రిజర్వేషన్లు, జనాభా వారీగా, సామాజిక వర్గాలవారీగా ఎలా ఉన్నాయన్న అంశాలపై జిల్లాల కలెక్టర్లు బుధవారం పునఃపరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత నివేదికలను సీల్డ్‌ కవర్లలో ఉంచి సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేయనున్నారు. జిల్లాల నుంచి రిజర్వేషన్ల వివరాలన్నీ అందాక పంచాయతీరాజ్‌ శాఖ వాటిని మరోసారి పరిశీలించనుంది. గతంలో అమలైన రిజర్వేషన్లు, తాజాగా లెక్కగట్టిన రిజర్వేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలన చేయనుంది. అనంతరం ఆ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఆ తర్వాత రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం చొప్పున రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్టు తెలుపుతూ అందు కు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత రాష్ట్రంలో ఖరారైన రిజర్వేషన్ల స్థానాలు, ప్రత్యేక జీవోను కలిపి ఎన్నికల సంఘానికి ఇచ్చి, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. ప్రభు త్వం పేర్కొన్న వివరాలను పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా దసరాలోపే స్థానిక సమరానికి షెడ్యూల్‌ రానున్నట్టు పరిస్థితుల దృష్ట్యా స్పష్టమవుతోంది.

*_మహిళలకు కేటాయింపు జరగలేదు:

_రిజర్వేషన్ల వ్యవహారం పూర్తికాగా.. ఇందులో మహిళలకు 50ు మేరకు కేటాయింపు జరగలేదని విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయ పార్టీల సమక్షంలోనే డ్రా విధానంలో మహిళలకు సీట్లను కేటాయించాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం మహిళలకు రిజర్వేషన్లను కేటాయించలేదని తెలిసింది. దీనిపై జిల్లాల నుంచి అన్ని నివేదికలు అందిన తర్వాత పంచాయితీరాజ్‌ శాఖ ప్రభుత్వానికి అందించబోయే సమగ్ర నివేదికలో ఒక స్పష్టత వస్తుందని కూడా చెబుతున్నారు.

*ప్రాథమికంగా రిజర్వేషన్ల కేటాయింపు ఇలా…

రిజర్వేషన్ల ఖరారు కోసం బీసీలకు 2024 కులసర్వే ప్రకారం, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం లెక్కగట్టారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2024లో నిర్వహించిన కులసర్వేలో బీసీలు (ముస్లింలతో కలిపి) 56.33శాతంగా ఉన్నారు. ఎస్సీలు 17.43, ఎస్టీలు 10.45శాతంగా ఉన్నారు. 2011 జనాభా లెక్క ల ప్రకారమైతే ఎస్సీలు 15.45, ఎస్టీలు 9.08శాతంగా ఉన్నారు. గతంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీల జనాభాలో స్వల్ప మార్పు ఉన్నది. ప్రస్తుతం జిల్లాల్లో పూర్తయి న రిజర్వేషన్ల ప్రాథమిక వివరాల ప్రకారం 42శాతంగా లెక్కగట్టిన తర్వాత బీసీలకు ఎంత మేర సీట్లు కేటాయింపు జరిగిందనేది తేలింది. దాని ప్రకా రం 12,760 గ్రామపంచాయతీల్లో దాదాపు 5,360 స్థానాలు, 1,12,534వార్డులకుగాను సుమారు 47,264 స్థానాలు బీసీలకు దక్కే అవకాశం కనబడుతోంది. ఇక 5,765 ఎంపీటీసీల్లో దాదాపు 2,421 స్థానాలు, 565 ఎంపీపీ, జడ్పీటీసీలకు సుమారు 237 చొప్పున కేటాయింపు జరగనున్నాయి. 31 జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాల్లో బీసీలకు దాదాపు 13వరకు స్థానాలు దక్కొచ్చునని అధికారికవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇవిపోనూ మిగిలిన స్థానాల్లో జనరల్‌, మహిళలకు కేటాయింపులు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలున్న గ్రామాల్లో 100ు వారికే కేటాయించనున్నారు. పూర్తినివేదికలు ప్రభుత్వానికి అందాక, ఎస్సీ, ఎస్టీలు, జనరల్‌ స్థానాలతో పాటు బీసీలకు ఎన్ని స్థానాలు దక్కుతాయనేదానిపై స్పష్టతరానుంది.

*న్యాయపరంగా జీవో నిలబడుతుందా….

బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో 42ు రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు ఆమోదించింది. వాటి షెడ్యూల్‌ 9లో చేర్చాలని కోరుతూ కేంద్రాన్ని కోరుతోంది. కానీ ఆ బిల్లులపై కేంద్రం ఎటూ తేల్చడంలేదు. పైగా స్థానిక సంస్థలలో అన్ని సామాజికవర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50ు మించకూడదన్న సు ప్రీంతీర్పు ఉంది. ఒకవేళ ఆ పరిధి దాటాలంటే అందుకు ప్రత్యేక కారణాలు ఉండాలని, వాటిని తేల్చేందుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుచేయాలని మరో కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కులసర్వే నిర్వహించింది. అనంతరం ప్రత్యేక కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఇప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారు. బీసీలకు పెంచిన రిజర్వేషన్ల అమలుకోసం ప్రభు త్వం ప్రత్యేక జీవోను విడుదల చేయాలనే యోచన లో ఉంది. కానీ ఈ జీవోను సవాల్‌ చేస్తూ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

*జడ్పీ చైర్‌పర్సన్‌, ఎంపీపీలే పూర్తి:

_రిజర్వేషన్ల వ్యవహారంలో మంగళవారం రాత్రి వరకు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీల స్థానాలకే పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గ్రామ పంచాయితీలు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీల స్థానాలకు కొన్నిచోట్ల రిజర్వేషన్లు పూర్తికాలేదని తెలిసింది. ఈ విషయాన్ని గమనించిన పంచాయితీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు ఆ స్థానాల్లో రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించాల్సిన పూర్తి వివరాలను మరోసారి క్షేత్రస్థాయి అధికారులకు వివరించారు. పూర్తయిన రిజర్వేషన్లతో పాటు మిగిలిపోయిన వాటిని బుధవారం సాయంత్రం వరకు పూర్తిచేసి, నివేదికలను ప్రభుత్వానికి కలెక్టర్లు అందించనున్నారు.

25 Sep 2025

Leave a Comment