తెలంగాణలో సన్న బియ్యం ధరలు గణనీయంగా తగ్గాయి. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఊరటను కలిగించింది. గతంలో క్వింటాల్ ధర రూ.5,000-6,000 మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ.4,000-4,500 మధ్యకు పడిపోయింది.
ఈ ధరల తగ్గుదల వెనుక ప్రభుత్వ కీలక చర్యల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ధరల తగ్గుదలకు కారణాలు:
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. అంతేగాక, రేషన్ కార్డు కలిగిన ప్రజలకు సరఫరాను పెంచడంతో బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ తగ్గింది. ఫలితంగా ధరలు స్వయంగా పడిపోయాయి. జూన్ నుంచి ప్రారంభమైన ఈ ధరల తగ్గుదల, జూలై మొదటివారంలో మరింత ప్రభావం చూపింది.
*ధరల మార్పులు ఇలా ఉన్నాయి:
హెచ్ఎంటీ రకం బియ్యం: రూ.5,600 → రూ.4,600
కర్నూల్ మసూరి: రూ.4,800 → రూ.4,000
జై శ్రీరామ్ రకం: రూ.5,800 → రూ.4,600
ఆర్ఎన్‌ఆర్, సాంబా రకాలు: క్వింటాలుకు రూ.1,000 వరకూ తగ్గుదల.
*రైతులకు ప్రయోజనమే.
ప్రభుత్వ ప్రోత్సాహంతో సన్న వడ్ల సాగు విస్తరించి, దిగుబడి పెరిగింది. ఇది మార్కెట్‌లో సరఫరాను పెంచి ధరల తగ్గుదలకు దారితీసింది. దీంతో రైతులకు ఆదాయం కూడా పెరిగే అవకాశముంది.
*రేషన్ లేని కుటుంబాలకు మంచి వార్త.
రాష్ట్రంలో సుమారు 30 లక్షల రేషన్ లేని కుటుంబాలు నెలకు సుమారు 60 వేల టన్నుల బియ్యం బహిరంగ మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పుడు ధరలు తగ్గడంతో వీరికి గణనీయంగా ఆర్థిక లాభం కలుగుతోంది.
వాణిజ్యంపై ప్రభావo.
మరోవైపు, ధరలు తగ్గినప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వ్యాపారుల అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హైదరాబాద్‌లోని రైస్ షాపుల్లో రోజువారీ కొనుగోళ్లు సగానికి తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. రామంతపూర్‌కు చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారి మాట్లాడుతూ, “250 క్వింటాళ్లు అమ్మేవాళ్లం, ఇప్పుడు 100 క్వింటాళ్లు కూడా అమ్మలేని పరిస్థితి” అన్నారు.