హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌తో పాటు మిగతా ప్రాంతాల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు.
సీఎస్, డీజీపీతో పాటు జిహెచ్ఎంసి కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని సూచించారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనలున్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పారు.
నగరంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.