విద్యార్థి కుటుంబ సభ్యులు అనుమానం..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల ఇంటర్మీడియట్ కళాశాలలో శనివారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గడ్డం సంతోష్ (17) అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నిజాంసాగర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి.
ఉదయం వ్యాయామానికి గ్రౌండ్‌కు వెళ్లిన సంతోష్ తిరిగి హాస్టల్‌కు రాకపోవడంతో కళాశాల సిబ్బంది వెతకడం ప్రారంభించారు. అన్వేషణలో భాగంగా కళాశాల వెనుక భాగంలోని పెద్ద చెట్టుకు టవల్ తో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కళాశాల సిబ్బంది పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి మధ్యాహ్నం తర్వాత కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోగా,మృతుడి పెద్ద అన్న గడ్డం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సంతోష్ మృతిలో కళాశాల ప్రిన్సిపాల్ , పీఈటీ నిర్లక్ష్యం ఉన్నదని, వారి తీరుపై అనుమానం ఉందని ఆరోపిస్తూ ఫిర్యాదును ఇవ్వడం జరిగింది. మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి, శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ ఘటనతో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో భయాందోళన చోటుచేసుకుంది. కళాశాలలో విద్యార్థులపై పర్యవేక్షణ లోపించినందునే ఈ విషాదం చోటు చేసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.