తెలుగు రాష్ట్రాల్లోని బీసీల ఏక్యత, ఆత్మగౌరవం మరియు అధికారం లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ (బీసీ వైపీ) ఆధ్వర్యంలో ఈ నెల 22న అమరావతిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న పూలే–అంబేద్కర్–మండల్–కర్పూరి ప్రాంగణంలో “బీసీ సింహ గర్జన” మహాసభ నిర్వహించనున్నట్లు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, న్యాయవాది గుయ్య సాయికృష్ణ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా సభకు సంబంధించిన పోస్టర్లను ఆర్మూర్ పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా బీసీలు సామాజికంగా, ఆర్థికంగా ఇంకా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రాజధాని ప్రాంతంలో బీసీ కులాలకు వెయ్యి ఎకరాల భూమి కేటాయించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి వారి అభివృద్ధికి వినియోగించాలని, అలాగే బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు మరియు చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 22న జరిగే “బీసీ సింహ గర్జన” మహాసభకు లక్షలాది మంది బీసీలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘ ప్రతినిధులు కొయ్యల నవీన్ యాదవ్, రాకేష్ గౌడ్, ప్రతీప్ యాదవ్, ప్రశాంత్ యాదవ్, ప్రకాష్ చారి, గణేష్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.








