ఆర్మూర్‌లో గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లు పరిశీలించిన పోలీస్ కమిషనర్….

On: Sunday, August 31, 2025 7:15 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి పోలీసు శాఖ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్., స్వయంగా పరిశీలించారు.

శోభాయాత్ర సాగబోయే ప్రధాన మార్గాన్ని ఆయన పరిశీలించి, రహదారి మరమ్మతు పనులు, బారికేడింగ్, సెక్యూరిటీ చర్యలను సమీక్షించారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు బారికేడ్లు బలంగా ఏర్పాటు చేయాలని, వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అదే విధంగా, జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించేలా ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్‌ను కఠినంగా అమలు చేయాలని, ముఖ్య జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించాలని సూచించారు.

నిమజ్జన ఘాట్ వద్ద ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని కమిషనర్ స్పష్టం చేశారు. అక్కడ పటిష్టమైన బారికేడ్లు, సరైన లైటింగ్, డ్రౌన్ ప్రూఫ్ జాకెట్లు, రక్షణ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ జె. వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ సిబ్బంది చందు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

15 Mar 2026

Leave a Comment