హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ(ఆదివారం) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను మంత్రి పొన్నం ప్రస్తావించారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తేలేని బీజేపీ నేతలు.. తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మోదీ సర్కార్ మెగా ఫెయిల్యూర్స్ సంగతేందని రామచందర్‌రావుని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను అడుగడుగునా మోసం చేసిందని ఆరోపించారు. వాగ్దానాలతో ఊదరగొట్టడం… విద్వేషాన్ని రెచ్చగొట్టడం… అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప మోదీ ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు. అలాంటి మీరు మా సీఎంకి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గురువింద సామేతను గుర్తు చేసే విధంగా ఉన్న మీ లేఖ నవ్వు తెప్పిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైర్లు గుప్పించారు..