ఢిల్లీ ధర్నాలో మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు…

On: Friday, August 8, 2025 12:19 PM

 

“బీసీల హక్కులపై బీజేపీకి అసలు మమకారం లేదు”.

ఢిల్లీ, ఆగస్ట్ 8:

ఢిల్లీ ధర్నా చౌక్ లో నిర్వహించిన బీసీ హక్కుల కోసం జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు రాజ్యాంగ పరంగా సమాన హక్కులు ఇవ్వాలని, రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ “ఎవరెంతో వారికంత” నినాదాన్ని గుర్తు చేస్తూ,

“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రకులానికి చెందినప్పటికీ, బీసీ హక్కులను బలోపేతం చేయడానికి అణగారిన వర్గాలకు తోడుగా ముందుకు వస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రం ముందడుగు వేస్తుంటే, కేంద్రంలో బీజేపీ మాత్రం నాటకీయంగా వ్యవహరిస్తోంది,” అని అన్నారు.

“తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చినా, ఢిల్లీలో తమ ఎంపీల ద్వారా ఆ బిల్లును ఆమోదించడంలో విఫలమవుతోంది. ఇది బీసీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని” అని విమర్శించారు.

“బీజేపీకి ఓట్లు కావాలి కానీ హక్కులు ఇవ్వాలని మాత్రం ఇష్టం లేదు. బీసీలను గల్లీల్లో మోసగించి, డిల్లీలో మర్చిపోతున్నారు. దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు చేయాలి,” అంటూ సూటిగా ప్రశ్నించారు.

సీతక్క తేటతెల్లం చేశారు.

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఆయన ప్రాతినిధ్యం వహించే యూపీలో ముస్లింలు బీసీలుగా పరిగణించబడుతున్నారు. ఇది కొత్త విషయం కాదు.

కొత్త ముస్లిం కులాలను బీసీల్లో చేర్చినట్టు బీజేపీ ప్రచారం చేయడం నిరాధారమైనది.

మోదీ బీసీ అని చెప్పుకుంటున్నా, ఆయన పాలనలో బీసీలకు న్యాయం జరగడం లేదు.

ప్రధాని కార్యాలయంలో బీసీ అధికారులే లేకపోవడం దానికి నిదర్శనం.

IIT, IIM వంటి విద్యాసంస్థల్లో రిజర్వేషన్లపై వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేయడం కూడా అదే దృక్పథాన్ని సూచిస్తోంది.

“బీసీలకు కులవృత్తుల ఆధారంగా ఉపాధి కరువైన ఈ సాంకేతిక యుగంలో, జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే బీజేపీకి పుట్టగతులు ఉండవు,” అంటూ హెచ్చరించారు.

రాహుల్ గాంధీని ‘యుగపురుషుడు’గా అభివర్ణించిన సీతక్క, ఆయన బీసీల హక్కుల కోసం చేపట్టిన భారత్ జోడో యాత్రను ప్రశంసించారు.

08 Aug 2025

Leave a Comment