మెదక్ జిల్లా చిన్న శంకరాపేట మండల్ కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు మట్టి నమూనా పరీక్షలపై కెవికే (కృషి విజ్ఞాన కేంద్రం) శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కెవికే శాస్త్రవేత్త ఎస్‌డీ నల్కర్ ప్రతాప్‌తో పాటు చిన్న శంకరాపేట వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు విద్యార్థులకు మట్టి నమూనా సేకరణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పంటలకు అవసరమైన పోషకాల స్థాయిని తెలుసుకోవడానికి మట్టి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మట్టి నమూనా సేకరించే సమయంలో పాటించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ప్రత్యేకంగా పొలంలో సమానమైన ప్రదేశాల నుంచి నమూనాలు తీసుకోవాలి, ఎరువులు వేసిన వెంటనే మట్టి నమూనా తీసుకోకూడదని సూచించారు. అలాగే మట్టి నమూనాను శుభ్రమైన పరికరాలతో సేకరించి, సరిగా లేబుల్ చేసి పరీక్షలకు పంపించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి పెరుగుతుందని వారు పేర్కొన్నారు.








