ఢిల్లీ, జులై 17: సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఈరోజు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు సీఎం. ఈ చిట్‌చాట్‌లో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాగా తాము ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయలేదని, చేయబోమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబసభ్యులే బయటికి వచ్చి చెప్తున్నారని.. తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పుకొచ్చారు రేవంత్. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కి వెళ్లాలా? అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
పారిపోయిన వ్యక్తి కేటీఆర్…!
దుబాయ్‌లో మాజీ మంత్రి కేటీఆర్ స్నేహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని సీఎం రేవంత్ అన్నారు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టును తెలంగాణకు తెప్పించినట్లు తెలిపారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని.. అతని చుట్టూ ఉండేవాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్ తో తానేం మాట్లాడతానని ఎద్దేవా చేశారు. వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయిన వ్యక్తి కేటీఆర్ అంటూ చురకలు అంటించారు. డ్రగ్స్ పై మాట్లాడకుండా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
అర్ధరాత్రి లోకేష్‌తో రహస్య భేటీనా?
ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ను (Lokesh) కేటీఆర్ రహస్యంగా ఎందుకు కలిశారు?, అర్ధరాత్రి వేళ లోకేష్‌తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశారు?.. ఇలా లోకేష్ తో మూడుసార్లు కేటీఆర్ ఎందుకు కలవాల్సి వచ్చింది? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR) ను కాపాడేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సీఎం. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని తేల్చి చెప్పారు..