*215 కోట్లతో ప్రోత్సాహకాలు…
*50 శాతం సబ్సిడీతో పందిళ్లు,పరికరాలు…
*సాగుకు రుణాలు.. పంటకు మార్కెటింగ్….
*కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్….
*వచ్చే ఐదేండ్లలో 2.50 లక్షల ఎకరాల విస్తరణ టార్గెట్….
హైదరాబాద్ : రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయలు పండించే రైతులకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ ‘కిసాన్ ఐడీ కార్డులు’ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్డుల ద్వారా రైతులకు సాగు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు సులభతరం చేయడంతో పాటు పలు ప్రోత్సాహకాలు అందించనున్నారు. కూరగాయల సాగు అభివృద్ధి కోసం రూ.215 కోట్ల బడ్జెట్‌తో సమగ్ర ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్రాన్ని కూరగాయల స్వయం సమృద్ధిలో దేశంలోనే మోడల్‌గా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో కంటే కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో దాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం 50 వేల ఎకరాల చొప్పున కూరగాయల సాగును విస్తరించి, వచ్చే ఐదేండ్లలో మొత్తం 2.50 లక్షల ఎకరాలకు తీసుకెళ్లాలని హార్టీకల్చర్ డిపార్ట్‌మెంట్‌కు సర్కారు స్పష్టమైన లక్ష్యం నిర్దేశించింది. దీంతో రాష్ట్రం కూరగాయల స్వయం సమృద్ధిలో దేశంలోనే ‘మోడల్ వెజిటబుల్ హబ్’గా ఎదగడానికి బలమైన అవకాశాలు ఏర్పడున్నాయి.
*50% సబ్సిడీతో పందిళ్లు, పరికరాలు, ప్రోత్సాహకాలు…
రైతులకు 50 శాతం సబ్సిడీతో పందిళ్లు, ఇతర పరికరాలను ఆర్‌కేవీవై, ఎమ్‌ఐడీహెచ్ పథకాల కింద అందించనున్నారు. హార్టీకల్చర్ డిపార్ట్‌మెంట్ పరిధిలో మినీ ట్రాక్టర్లు, తవ్వే యంత్రాలు సహా 17 రకాల యంత్ర పరికరాలకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్ స్కీమ్‌లను అనుసంధానం చేసి స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, ప్లాస్టిక్ మల్చింగ్ పేపర్లు, నాణ్యమైన విత్తనాలు, పరికరాలు తదితరాలను సబ్సిడీ ధరల్లో అందజేస్తారు. ఆఫ్ సీజన్, ఎగ్జోటిక్ కూరగాయల సాగు, రసాయన అవశేషాలు లేని పంటలకు ప్రీమియం ధరలు లభించే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. టమాట, మిరప ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రైతులకు మరింత మద్దతు లభించనుంది. ప్రతి రైతు మరో ఐదుగురిని కూరగాయల సాగు వైపు మళ్లించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో వెజిటబుల్ వలంటీర్లను తయారు చేసి గ్రామ స్థాయిలో ఉద్యమంగా సాగు విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో కోతుల బెడద కారణంగా కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సోలార్ ఫెన్సింగ్, ఆధునిక టెక్నాలజీలను అందించనున్నారు. విజయవంతమైన రైతుల అనుభవాలను తెలియజేసేందుకు ఎక్స్‌పోజర్ విజిట్లు ఏర్పాటు చేస్తారు. అడవుల సమీపంలో తునికి, ఇరికి వంటి చెట్లను పెంచడం ద్వారా కోతులు పొలాల్లోకి రాకుండా నిరోధించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
*ప్యాక్స్ రైతులకు హార్టికల్చర్ వర్సిటీ శిక్షణ…
హార్టికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ‘కూరగాయల సాగు మహోద్యమం’ నడపాలని సర్కారు భావిస్తోంది. శిక్షణ పొందిన రైతులు ప్రతి ఒక్కరు తమవంతుగా 10 నుంచి 15 మంది ఇతర రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలని ప్రభుత్వం కోరుతోంది. విత్తనోత్పత్తి సంస్థను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తక్కువ పెట్టుబడితో చిన్న చిన్న మెలకువల ద్వారా 30 శాతం అదనపు దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతం అయితే తెలంగాణలో కూరగాయల స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన కూరగాయలు అందుతాయని హార్టీకల్చర్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
*సాగుకు రుణాలు, పంటకు మార్కెటింగ్…
కూరగాయలు పండించే రైతులకు కిసాన్ ఐడీ కార్డులు జారీ చేయడం ద్వారా సాగు రుణాలు, పంట మార్కెటింగ్ సౌకర్యాలు సులభంగా అందుతాయి. స్థానిక వనరులతో సేంద్రియ ఎరువులు తయారీపై శిక్షణ ఇచ్చి ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నారు. మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా దశలవారీగా సాగు చేయాలని, మల్టీ లేయర్ ఫార్మింగ్, సమగ్ర పురుగు నియంత్రణ, పోషక యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. పామ్ ఆయిల్ తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేయాలని రైతులను ప్రోత్సహించననున్నారు. నాణ్యమైన నర్సరీ నారు వినియోగం, పంట మార్పిడి విధానాలు అమలు చేస్తారు. ఆఫ్ సీజన్, ఎగ్జోటిక్ కూరగాయలు, రసాయనాలు లేని సేంద్రియ కూరగాయలకు ప్రీమియం ధరలు లభిస్తాయని అధికారులు తెలిపారు.








