A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆదివారం తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఆర్మూర్లో పెరుగుతున్న అవినీతి వ్యవహారంపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో అవినీతి ప్రమాదకర స్థాయికి చేరుకుందని, అన్ని ప్రభుత్వ విభాగాల్లో “పర్సంటేజ్” విధానం అధికారికంగా మారిపోయిందని ఆయన మండిపడ్డారు.
ప్రతి శాఖలో అవినీతే ప్రధాన పనిగా మారింది.!
బాల్కొండలో 18 ఇసుక క్వారీలు నడుస్తుండగా రిజిస్ట్రేషన్, తహసీల్దార్, మున్సిపాలిటీ, ఎంవీఐ తదితర విభాగాలు అవినీతిలో మునిగిపోయాయని పేర్కొన్నారు. “5 లక్షల చెక్కుకు 1.50 లక్షల కమిషన్ వసూలు చేసేవరకు పరిస్థితి దిగజారింది. ప్రజలను నిత్యం దోచుకుంటున్నారు” అని జీవిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏసీబీ దాడుల్లో బయటపడ్డ అక్రమాలు:
ఇటీవలి ఏసీబీ దాడుల్లో కమిషనర్ రాజు వద్ద లభించిన రూ. 4,30,000 రూపాయలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన—కలెక్టర్, సీపీ వెంటనే చర్యలు తీసుకుని ఆ సొమ్మును ప్రజలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్లో 20 నుండి 50 కోట్ల వరకు అక్రమ సొమ్ము బయటపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
‘జనతా గ్యారేజ్’తో ఉద్యమం:
“ఆర్మూర్ ప్రజల రక్తం పిండి వసూలు చేసే అధికారులను విడిచిపెట్టం. అవినీతి చేసినవారి దగ్గర నుంచి దోచుకున్న ధనం వసూలు చేసి తిరిగి ప్రజలకు ఇవ్వకపోతే మేము నిశ్శబ్దంగా ఉండం” అని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ‘జనతా గ్యారేజ్’ ఏర్పాటు చేసి పోరాటాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.
ప్రస్తుత ఎమ్మెల్యేపై ప్రశ్నలు:
ఈ వ్యవహారంపై ప్రస్తుత ఎమ్మెల్యే ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించిన ఆయన, కాంగ్రెస్–బీజేపీ పాలనల్లో జరిగిన అవినీతిని కూడా ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఆర్మూర్లో అవినీతి నిర్మూలన కోసం తాను ప్రజలకు అండగా నిలుస్తానని స్పష్టం చేస్తూ ఆయన ప్రకటన ముగించారు.







