A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్:
ఆర్మూర్ మండలం మంతిని గ్రామం పర్యావరణ పరిరక్షణలో ఒక వినూత్న మెట్టు వేసింది. తొలిసారిగా అక్కడ కర్రలతో తయారైన గణేశుడు – ‘కర్ర గణపతి’ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా గ్రామస్తులు కొత్త ఆదర్శంగా నిలిచారు.
ఈ వినూత్న ఆలోచనను హనుమాన్ యూత్ సభ్యులు అమలుపర్చారు. గత 35 ఏళ్లుగా వారు గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నా, గత 12 ఏళ్లుగా మట్టి విగ్రహాలతో సాంప్రదాయక ఉత్సవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈసారి మట్టికూడా వినియోగించకుండా, పూర్తిగా పర్యావరణానికి హాని లేకుండా కర్రలతో గణేశుని తయారు చేయించారు.
ఈ విగ్రహాన్ని నిర్మల్‌కు చెందిన కళాకారుడు వజ్రం చారి రూపొదించగా, గ్రామస్థుల సహకారంతో రూ.1.70 లక్షల వ్యయంతో తయారు చేశారు. తొమ్మిది రోజుల పాటు పూజలు, భజనలు, నిత్య అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సభ్యులు తెలిపారు. అనంతరం మహాగణపతిని ఊరేగింపుగా గ్రామంలో తిప్పి, యథాస్థానంలో ఉంచనున్నారు.
ఈ పర్యావరణ మిత్ర కార్యక్రమంలో రమేష్, ప్రసాద్, ఎత్తిన సురేష్, పుట్టముత్యం, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు చురుగ్గా పాల్గొన్నారు.







