‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ అత్యంత శక్తివంతమైన 100 మంది భారతీయుల జాబితా (IE100) 2026లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు. గతేడాది 28వ స్థానంలో ఉన్న ఆయన మూడు స్థానాలు ఎగబాకారు.
తెలంగాణ సీఎంగా రెండేళ్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో కుల గణన నిర్వహణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ ఆయన పట్టును మరింత బలపరిచాయి. పార్టీలో అంతర్గత వ్యతిరేకత ఉన్నప్పటికీ తన పాపులారిటీని నిలుపుకున్నారు. జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ హైకమాండ్ సన్నిహితుడిగా కీలక వ్యక్తిగా మారారు. భారత్ జోడో యాత్ర ఆయనకు రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం తెచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 9వ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి (25)కి మాత్రమే టాప్ 25లో చోటు దక్కింది. ఓవరాల్గా టాప్ 25లో ఉన్న ఎన్డీయేతర సీఎంలలో మమత, రేవంత్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. రేవంత్ రెడ్డి తర్వాతే ప్రియాంకా గాంధీ (35), మల్లిఖార్జున్ ఖర్గే (43) ఉన్నారు.
ఇక అగ్రస్థానాల్లో మోదీ, షా.. వరుసగా 12వ ఏడాది కూడా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. తెలంగాణకు చెందిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 34 స్థానాలు ఎగబాకి 55వ ర్యాంకు సాధించారు.








