హైదరాబాద్: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(మంగళవారం జులై 29) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహితంగా మార్చాలని దిశానిర్దేశం చేశారు. కోర్ సిటీలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని ఆదేశించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ క్రమంలో అన్ని శాఖలు సమగ్ర డీపీఆర్‌లు తయారు చేయాలని మార్గనిర్దేశం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్మాణ రంగ వ్యర్థాలను సిటీలో ఎక్కడపడితే అక్కడ డంప్ చేయకుండా చూడాలని.. ఉద్దేశపూర్వకంగా అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర మంచినీటి సరఫరా.. సీవరేజీ బోర్డు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఓఆర్ఆర్ పరిధిలోని వారసత్వ కట్టడాల సంరక్షణ, వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకుగానూ కులీకుతుబ్ షాహీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించి దానిని మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశం చేశారు. పాతబస్తీలో మెట్రో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మెట్రో ఇతర ఫేజ్‌ల అనుమతులు, తదితర విషయాల్లో ఏమాత్రం జాప్యం చేసిన సహించబోమని హుకుం జారీ చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులు పట్టాలెక్కేలా చూడాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటేడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని నిర్దేశించారు. మూసీ రివర్ ఫ్రంట్‌కు సంబంధించి హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఓఆర్ఆర్ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్‌గూడ జంక్షన్‌లో మూసీ రివర్ ఫ్రంట్‌కు ప్రతీకగా ఇండియా గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాంటి ఓ ల్యాండ్ మార్క్‌ను నిర్మించాలని సూచించారు. మూసీపైన బ్రిడ్జి కం బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలని నిర్దేశించారు. అనుమతులు, నిబంధనల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. మీరాలం ట్యాంక్ ఎదుట ఏర్పాటు చేసిన ఎస్టీపీలు వాటి సామర్థ్యానికి అనుగుణంగా పని చేసేలా చూడాలని మార్గనిర్దేశం చేశారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు..