ఆర్.టి.ఐ చట్టం అమలులో మెదక్ జిల్లాలో లోపాలా?
ఎ9 న్యూస్ డెస్క్ | మార్చి 2 | మెదక్ జిల్లా
కొల్చారం మండలంలో గ్రామ అభివృద్ధి నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల్లో అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానంతో స్థానికులు ఆర్టీఐ దాఖలు చేశారు. ఆర్టీఐ ద్వారా బయటపడిన వివరాల ప్రకారం, ఒక సిస్టమ్ ఆపరేటర్ బ్యాంక్ ఖాతాలో లక్షల రూపాయలు జమ అయినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
గ్రామంలో స్పష్టమైన అభివృద్ధి పనులు కనిపించకపోయినా, ఖాతాల్లో పెద్ద మొత్తాలు జమ కావడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సరైన విధంగా వినియోగించబడుతున్నాయా? సిస్టమ్ ఆపరేటర్ల ఖాతాల్లో నిధులు ఎందుకు జమ అవుతున్నాయి? అనే ప్రశ్నలు స్థానికులు లేవనెత్తుతున్నారు.
పూర్తి వివరాలు వెల్లడించాలని ఎంపీటీఓ గారిని కోరినా సమాధానం రాకపోవడంతోనే ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోరినట్లు గ్రామస్థులు తెలిపారు. అయితే ఆర్టీఐ చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామ నిధుల వినియోగంపై పారదర్శకత తీసుకురావాలని, పూర్తి వివరాలు ప్రజలకు అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.





