హైకోర్టులో టీజీపీఎస్సీ వెల్లడి.
హైదరాబాద్:జూలై 4; గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను తెలుగు మాధ్యమంలో రాసిన విద్యార్థుల పట్ల వివక్ష చూపారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని..
అది వట్టి అపోహ మాత్రమే అని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలిపింది. వెనుకబడిన వర్గాలవారు మాత్రమే తెలుగు మాధ్యమంలో పరీక్ష రాస్తారనుకోవడం వాస్తవం కాదని.. ఆంగ్ల మాధ్యమంలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే అని తెలిపింది. ఆంగ్లం ఉన్నతవర్గాల వారికి సంబంధించిన భాష అనుకోవడం పొరపాటు అని తేల్చిచెప్పింది. గ్రూప్-1 మూల్యాంకనం, సెంటర్ల కేటాయింపు, సమాధాన పత్రాలు సరిగా దిద్దలేదనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ”గ్రామాల్లో సైతం పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివించడానికి ఇష్టపడుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో మెయిన్స్ రాసి అర్హత సాధించిన వారిలో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాలవారే ఉన్నారు. అంతేతప్ప తెలుగు పట్ల ఎలాంటి వివక్ష లేదు. ప్రస్తుతం అర్హత సాధించిన వారిలో ఆంగ్లంలో రాసిన వారు 89 శాతం ఉండగా తెలుగులో రాసిన వారు దాదాపు 9.9 శాతం ఉన్నారు.
ఉర్దూలో కేవలం ఒక్కరే అర్హత సాధించారు. అలాగే కొంతమందిని కావాలనే సెలెక్టివ్‌గా కొన్ని సెంటర్లకు కేటాయించారన్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఎవరు ఏ సెంటర్‌కు వెళ్లాలనేది కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ నిర్ణయిస్తుంది. 18, 19 సెంటర్లలో 12 శాతం మంది అర్హత సాధించారనడం తప్పుడు ఆరోపణ. ఆయా సెంటర్లలో 5 శాతానికి మించి అర్హత సాధించలేదు. అది కూడా అక్కడ ఎక్కువ మంది రాయడం వల్ల ఆ సంఖ్య వచ్చింది. ప్రొవిజనల్ లిస్ట్ పెట్టలేదు అనే ఆరోపణ కూడా సరికాదు. ఏ అభ్యర్థికి ఆ అభ్యర్థి ప్రొవిజనల్ మార్కులు కనిపిస్తాయి. ప్రొవిజనల్ జాబితా కేవలం రీకౌంటింగ్ కోసం మాత్రమే. తుది ఫలితాలు మార్చి 30న ప్రకటించేశాం. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుంటే ఎంపికైన అభ్యర్థులకు పూరించలేని విధంగా నష్టం జరుగుతుంది” అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అప్పుడు ధర్మాసనం.. ”మూల్యాంకనం చేసే పద్ధతి, అనుసరించాల్సిన ‘కీ’ కి సంబంధించి ఎవాల్యుయేటర్లకు ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చారు? ఉదాహరణకు తెలంగాణ చరిత్ర తీసుకుంటే ఏయే అంశాలు ప్రస్తావిస్తే ఎంత వెయిటేజీ ఇవ్వాలి అనే నమూనాలో కీ ఉంటుంది కదా?” అని ప్రశ్నించింది. ఆ వివరాలన్నీ సీల్డ్ కవర్‌లో ఇస్తామని.. నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదాపడింది.