రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.13 లక్షల కోట్లు ఖర్చు – తుమ్మల నాగేశ్వరరావు.
మెదక్ | ఆగస్టు 18 | A9 న్యూస్:
వానాకాలం పంటల సాగు వేగం పుంజుకోవడంతో, యూరియా సరఫరా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దృష్టి సారించింది. సోమవారం, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, యూరియా & ఎరువుల లభ్యతపై సమీక్ష చేశారు.
వర్షాభావం అనంతరం వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల రైతులు పంటల సాగును వేగంగా చేపట్టారని, దీనితో యూరియా డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రానికి కేటాయించిన యూరియా సరఫరా తక్కువగా ఉందని, ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల డిఫిసిట్ ఏర్పడిందన్నారు.
“ప్రస్తుతం రైతులకు 2 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ నుంచి యూరియా సరఫరా చేస్తున్నాం. ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న 35 వేల మెట్రిక్ టన్నుల స్టాక్‌ను సమర్థవంతంగా వినియోగించాలి,” అని మంత్రి స్పష్టం చేశారు. రైతులు ఎక్కువగా స్టాక్ చేయకుండా, అవసరానుసారం మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.
పరిశ్రమలకు యూరియా డైవర్ట్ కాకుండా పటిష్ట చర్యలు, మండల స్థాయిలో స్టాక్ మానిటరింగ్, బ్లాక్ మార్కెట్ కు అడ్డుకట్ట వంటి కీలక సూచనలు చేశారు.
సచివాలయంలో పాల్గొన్న సీఎస్ కె. రామకృష్ణారావు మాట్లాడుతూ, యూరియా కొరతకు జియో-పొలిటికల్ పరిస్థితులు, ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ ఉత్పత్తి లోపాలు కారణమని చెప్పారు. అయినప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే రైతులకు లక్ష మెట్రిక్ టన్నుల అదనంగా ఎరువులు సరఫరా చేశామన్నారు.
అనుమానాస్పదంగా ఎక్కువ కొనుగోలు చేస్తున్న బయ్యర్లను ట్రాక్ చేయాలని, సరిహద్దు జిల్లాల్లో ఇతర రాష్ట్రాల రైతులకు అమ్మకాలు జరగకుండా చూడాలని, డ్రోన్ ద్వారా నానో యూరియా, డీఏపీ ప్రోత్సహించాలని సీఎస్ సూచించారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో జిల్లా వ్యవసాయ అధికారులు, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు వీసీ లో పాల్గొన్నారు. జిల్లాలోని ప్రైవేట్ డీలర్లపై ఆకస్మిక తనిఖీలు, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.