మెదక్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – సహాయక చర్యల్లో యంత్రాంగం అభినందనీయం: సీఎం…

On: Thursday, August 28, 2025 8:27 PM

మెదక్, ఆగస్టు 28 (A9 న్యూస్):

మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం జిల్లా పర్యటన నిర్వహించారు. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించిన ఆయన, సహాయక చర్యల్లో పాలన యంత్రాంగం చూపిన చొరవను ప్రశంసించారు.

సాయంత్రం 5:20కు మెదక్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. 6:20 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇలా అన్నారు:

“ప్రకృతి విపత్తులు ఎప్పుడు సంభవిస్తాయో చెప్పలేం. కానీ వాటికి ఎదుర్కొనే తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మన బాధ్యత. పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి.”

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును చరవాణి ద్వారా సంప్రదించి, నష్టపరిహార ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పంట నష్టానికి సంబంధించిన ఆధారాలు ఫోటో, వీడియో రూపంలో భద్రపరచాలని సూచించారు.

వర్షపాతం నమోదు, యూరియా కొరత వంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు.

“రైతులు యూరియాను ముందుగా కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతోంది. నానో యూరియా గురించి రైతులకు అవగాహన పెంచాలి,” అని సీఎం పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

15 Mar 2026

Leave a Comment