తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. రాష్ట్రంలో అధునాతన సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలు ఉన్నందున ASIP, మైక్రో LED ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు EMC 2.0 పథకం కింద అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ ఇప్పటికే పరిశోధనా సౌకర్యాలతో, సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులతో ముందంజలో ఉన్నదని సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉద్యోగాలు, పెట్టుబడులు పెరగడంతోపాటు, దేశీయ టెక్నాలజీ రంగానికి తెలంగాణ కీలక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్త రైలు మార్గాలు-
రూ.8 వేల కోట్ల విలువైన రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్ట్‌కు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టుతో గ్రామీణ పేదరికం తగ్గడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. దీంతోపాటు కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి, ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించాలన్నారు.
రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్ట్ అను సంధానం.
రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు గ్రామీణ, పట్టణ ప్రాంతాల అనుసంధానాన్ని పెంచి, హైదరాబాద్‌లో రద్దీ తగ్గిస్తుందని సీఎం తెలిపారు. హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందరు ఓడరేవుకు రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. ఈ మార్గం ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ఉపయోగపడుతుందని వివరించారు.
రైలు మార్గాలకు అనుమతి కోరిన సీఎం.
ఇందులో భాగంగా వికారాబాద్ – కృష్ణా (122 కి.మీ. అంచనా వ్యయం రూ.2,677 కోట్లు), కల్వకుర్తి – మాచర్ల (100 కి.మీ. అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు), డోర్నకల్ – గద్వాల (296 కి.మీ. అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్ – మిర్యాలగూడ (97 కి.మీ. అంచనా వ్యయం రూ.2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మార్గాలు రాష్ట్రంలో అనుసంధానత, పారిశ్రామిక, వ్యవసాయ ఎగుమతులకు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న నాయకులు:
సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, రామ సహాయం రఘురామరెడ్డి, సురేశ్ షెట్కార్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, ఆర్ అండ్ బీ కార్యదర్శి వికాస్ రాజ్, డాక్టర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఈ భేటీలో ఉన్నారు.
మంత్రి సానుకూల స్పందన;
సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ పార్క్, రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే విషయంలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు దోహదపడతాయని సీఎం అభిప్రాయపడ్డారు..