మహిళా శక్తిని స్మరించుకుంటూ భూపతి రెడ్డి ప్రకటన
జక్రాన్‌పల్లి, ఆగస్టు 14 (ఎ9 న్యూస్):
జక్రాన్‌పల్లి మండలంలోని ఆర్గుల్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐలమ్మ మనవరివారైన చిట్యాల శ్వేతను శాలువాతో సన్మానించామని, ఆమెను ఐలమ్మ వారసురాలిగా ప్రభుత్వం గుర్తించి మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించిందని తెలిపారు.
మహిళలపై గౌరవం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నాయని, “సంవత్సరానికి రూ. 20,000 కోట్లు ఖర్చు చేసి, ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది” అని ఆయన అన్నారు. చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధిని స్ఫూర్తిగా తీసుకొని మహిళలకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ కట్టుబడి ఉందన్నారు.
ఈ సందర్భంగా, గ్రామ మాజీ సర్పంచ్ గొర్త రాజేందర్ మాట్లాడుతూ, ఈ రోజు రజక సంఘానికి గర్వించదగిన రోజు అని, చాకలి ఐలమ్మ చేసిన పోరాటం రజకులకు ప్రేరణనిచ్చిందని అన్నారు. అందుకే ఈ విగ్రహ ఆవిష్కరణ రజక సంఘం ఆధ్వర్యంలో జరగిందని తెలిపారు.
అలాగే బీసీ హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తుచేస్తూ, 42 శాతం రిజర్వేషన్‌కు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపినప్పటికీ, బీజేపీ ప్రభుత్వం దానిని తిరస్కరించిందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, ఆర్గుల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ వి.డి.సి సభ్యులు, రజక సంఘం కులస్తులు, మండలంలోని అన్ని గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.








