బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే
రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి
జూలై 17న రైల్ రోకో నిర్వహించి తీరుతాం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సింగరేణి జాగృతి రైల్ రోకో పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ :
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 17న రైల్ రోకో నిర్వహించిన తీరుతామన్నారు. సోమవారం తన నివాసంలో సింగరేణి జాగృతి రూపొందించిన రైల్ రోకో పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. బీసీ సమాజం, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీ, కౌన్సిల్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు వేర్వేరు బిల్లులు పాస్ చేసిందన్నారు. ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు. వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన రైల్ రోకో చేసి తీరుతామని తేల్చిచెప్పారు. రైల్ రోకోకు సింగరేణి జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల పెంపు, రైల్ రోకో అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. జూలై 16, 17, 18 తేదీల్లో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే కుట్రలు చేస్తోందని.. వాటిని తిప్పికొడుతామన్నారు. రాజకీయ పార్టీల పరంగా బీసీలకు అవకాశం కల్పించడం కాదు, చట్టబద్దమైన రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. ఓడిపోయే స్థానాలకు బీసీలకు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తే 42 శాతం స్థానిక సంస్థల్లో బీసీ ప్రజాప్రతినిధులకు అవకాశం దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల సాధన కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సింగరేణి జాగృతి నాయకులు వెంకట్, నరేశ్ నేత, శ్రీనివాస్, భువనచంద్ర, సిద్దిఖ్ షేక్, అనిల్, శ్రీకాంత్ రెడ్డి, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో సర్వేయర్ నోటిఫికేషన్ ఇవ్వాలి
సింగరేణి కాలరీస్ సంస్థలో ఇంటర్నల్ సర్వేయర్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సింగరేణిలో పని చేస్తున్న కార్మికులు సర్వేయర్ కోర్సు పూర్తి చేసి డీజీఎంఎస్ నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంస్థలో ఇంటర్నల్ సర్వేయర్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి సర్వేయర్ కోర్సు పూర్తి చేసిన వారి కోసం నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.
ఐదు గ్రామాల ప్రజలు, తెలంగాణ జాగృతి విజయం
భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా, పట్టణాన్ని ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం ఆ ఐదు గ్రామాల ప్రజలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఐదు గ్రామాలను విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ ఇవ్వడాన్ని ‘ఎక్స్’ వేదికగా స్వాగతించారు. 2014లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ చీకటి ఆర్డినెన్స్ ఇచ్చిందని, దీంతో భద్రాచలం పట్టణానికి పక్కనే ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్టణం, గుండాల గ్రామాలు ఏపీలో విలీనం అయ్యాయని తెలిపారు. ఫలితంగా భద్రాచల శ్రీ సీతారామ స్వామి ఆలయ భూములు ఏపీలోకి వెళ్లిపోయాయి, ఐదు గ్రామాల ప్రజలు విద్య, వైద్యం సహా ఇతర అవసరాల కోసం నిత్య నరకం అనుభవిస్తున్నారని అన్నారు. ఐదు గ్రామాల గోడు పై తెలంగాణ జాగృతి ఈనెల 20న ‘పోలవరం – తెలంగాణ పై జలఖడ్గం’ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోనే ఐదు గ్రామాలను విలీనం చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఐదు గ్రామాలను విలీనం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
కేసీఆర్ పాలన.. సాగుకు స్వర్ణయుగం
కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగమన, ఇదే విషయాన్ని కేంద్ర అర్థగణాంక శాఖ తాజా నివేదికలో స్పష్టం చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పదేళ్లలోనే రాష్ట్ర పంట ఉత్పత్తుల విలువ రూ.70 వేల కోట్లకు పైగా పెరిగిందన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, క్రమ తప్పకుండా రైతుబంధు, భూమిశిస్తు, నీటి తీరువా రద్దు చేయడం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేయడం, ప్రాజెక్టు కాల్వలపై ఏర్పాటు చేసిన మోటార్ల క్రమబద్ధీకరణ, ఊరూరా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతోనే కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారని తెలిపారు. విధి వక్రీకరించి రైతు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందజేసి ఆదుకున్నారని అన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి 8 మంది మృతి చెందడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.