హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బీసీ నేతలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతిని కలవడానికి నయా ప్లాన్ చేశారు. ఆగస్టు 8వ తేదీన కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేసింది. కరీంనగర్ సభ వేదికగా బీసీ రిజర్వేషన్లకు తాము అనుకూలంగా ఉన్నామనే స్పష్టమైన ప్రకటన ఇవ్వాడానికి బీఆర్ఎస్ హై కమాండ్ ఓ కార్యాచరణ రూపొందించింది. ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్, బీజేపీ నేతల వైఖరిని కేటీఆర్ ప్రశ్నించనున్నారు.
బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం:
కాగా, బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. తెలంగాణ భవన్‌లో ఇవాళ(మంగళవారం జులై 29) బీఆర్ఎస్ బీసీ నాయకుల సమావేశం జరిగింది. కాంగ్రెస్‌కు పోటీగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల కోసం ఆగసు 8వ తేదీన కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టి కాంగ్రెస్ తప్పుకుంటోందని మండిపడ్డారు. బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే.. మిగిలిన మూడు మంత్రి పదవులను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో డ్రామాలు ఆపాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు..