A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాలలో బోనాల పండుగను సాంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ చేతులారా బోనాలు తయారు చేసి, రకరకాల ప్రసాదాలను వండి తీసుకువచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఈ ఆధ్యాత్మిక పండుగను పాఠశాల ఛైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ సూచనల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్జాపూర్ లక్ష్మీనారాయణ తన సతీమణి రాజా సులోచనతో పాటు, అల్జాపూర్ గంగాధర్, దేవేందర్ లు విద్యార్థులకు బోనాల పండుగ విశిష్టతను వివరిస్తూ అవగాహన కల్పించారు.
ఈ వేడుకలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నవిత మాట్లాడుతూ,
“బోనాల పండుగ మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఇది ప్రజల ఐక్యతను, భక్తి శ్రద్ధలను ప్రతిబింబిస్తుంది. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో జీవితం సుఖశాంతులతో నిండిపోతుంది,” అని తెలియజేశారు.
అంతేకాకుండా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, ఊరేగింపు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉపాధ్యాయ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పాల్గొని పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.