ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలుపాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ నేతలు అందరూ ఢిల్లీ వెళ్లీన సంగతి తెలిసిందే. నిన్న జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించారు. అయితే నిన్న మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఇవాళ(గురువారం) మీడియాతో మాట్లాడారు.
బీజేపీ అడ్డుకుంటుంది..
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాకుండా మోదీ, అమిత్‌షా అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి ధర్నాలో బీఆర్‌ఎస్ ఎందుకు పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.ధర్నాలో పాల్గొనకపోగా అవహేళన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
కులగణన వివరణ..
కులగణనలో సంపూర్ణ వివరాలు సేకరించామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. బీసీ జనాభా లెక్కలు తెలుసుకునేందుకే కులగణన చేసినట్లు తెలిపారు. ఆ తరువాతే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో..42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రెండు బిల్లులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని BRS చట్టం చేసిందని, BRS చేసిన చట్టాన్ని అధిగమించేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు. 4 నెలలు గడుస్తున్నా బిల్లులను రాష్ట్రపతి ఆమోదించలేదని అసహనం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం క్షేత్రస్థాయిలో అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. శాసనసభలో ఏకగ్రీవ ఆమోదంతోనే చట్టాలను ఢిల్లీకి పంపామని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో పోరాడాలనే ఢిల్లీకి వచ్చామని రేవంత్ వెల్లడించారు.
మద్దతుకు ధన్యవాదాలు ..
నిన్నటి ధర్నాకు 100 మందికిపైగా ఎంపీలు మద్దతు ప్రకటించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే.. ధర్నాకు మద్దతు తెలిపిన డీఎంకే, ఎన్సీపీ ఎస్పీ ఇతర పార్టీల నేతలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. కులగణన మోడల్‌ను రాహుల్, ఖర్గే ప్రశంసించారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు అందరూ జంతర్ మంతర్ నిరసన కార్యక్రమంలో కులాలకు అతీతంగా పాల్గొన్నారని తెలిపారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేస్తున్నట్లు రేవంత్ చెప్పుకొచ్చారు.
కిషన్ రెడ్డికి కౌంటర్..
ధర్నాకు రాహుల్, ఖర్గే రాకపోవడంపై గల్లీ లీడర్లలా కిషన్‌రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. కులగణన సర్వేపై కిషన్‌రెడ్డికి ప్రెజెంటేషన్ ఇస్తామని తెలిపారు. కిషన్‌రెడ్డి డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చేస్తే.. కిషన్‌రెడ్డి అనుమానాలను అధికారులు నివృత్తి చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు..