*బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు*
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
*మోదీ నైతిక విలువలతో పాలన అందిస్తున్నారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీరామ్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇంకా ఏమీ అనుకోలేదన్నారు.
కేటీఆర్ అందించిన స్ర్కిప్ట్‌నే మీరూ చదువుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారన్న విలేకరుల ప్రశ్నకు.. సీఎం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాల ఆడిటోరియంలో బీజేపీ మహిళామోర్చా ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ’ అంశంపై నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేడ్కర్ రూపకల్పన చేసిన మహోన్నత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తూ నైతిక విలువలతో కూడిన పాలనను నరేంద్రమోదీ అందిస్తున్నారని అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎలా చెరబట్టారనే విషయాలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ చీకటి రోజులు దేశ చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోయాయని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ డీకే ఆరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు, నేతలు డాక్టర్ ఎం.గౌతమ్‌రావు, లంకల దీపక్‌రెడ్డి, మహిళా మోర్చా నేతలు శిల్పారెడ్డి, రాజు నేత, తులసి, సమత తదితరులు పాల్గొన్నారు..