ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని “ది వే టు ఫ్రీడమ్” పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మందికి పైగా వెట్టి చాకిరి బాధితులు హాజరై తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ గారు, ప్రముఖ నటి అమల అక్కినేని గారు కూడా పాల్గొన్నారు.
బాండెడ్ లేబర్ సమస్యపై తనకు బాగా అవగాహన ఉందని తెలియజేసిన మంత్రి గారు, బాధితుల కథలు విన్న తరువాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రాధాన్యత ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. శివమ్మ అనే బాధితురాలు రాజస్తాన్ నుంచి వచ్చి ఇప్పుడొక నాయకురాలిగా ఎదుగుతున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ, మరింత మంది బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా బాండెడ్ లేబర్ విముక్తికి ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ పోస్టర్‌ను మంత్రి గారు ఆవిష్కరించారు. నటి అమల గారి లాంటి మరిన్ని ప్రముఖులు ఈ ఉద్యమంలో భాగం అయితే అవగాహన మరింత పెరుగుతుందన్నారు. “మీ బాధలు విని, ప్రభుత్వంగా మద్దతు అందించేందుకు ఈరోజు ఇక్కడికి వచ్చాను” అంటూ బాధితులకు భరోసానిచ్చారు.