నాగర్ కర్నూలు, ఆగస్ట్ 06: బీఆర్ఎస్‌ను వీడిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. ఆ పార్టీపై సంచలన వ్యాఖలు చేశారు. బుధవారం నాగర్ కర్నూలులో గువ్వల బాలరాజు విలేకర్లతో మాట్లాడుతూ.. అసమర్థ నాయకత్వం కుట్రలు చేసి తనను ఓడించిందంటూ బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. అన్యాయాన్ని ఎదిరించే పాత్రను ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పోషించడం లేదన్ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు కష్ట కాలంలో పార్టీ అది నాయకత్వం అండగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏమి ఆశిస్తున్నారో అది చేయకుండా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జీబీఆర్ ( గువ్వల బాలరాజు) రూ. 100 కోట్లకు అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు.
గువ్వల బాలరాజు అంటేనే ఒక సెన్సేషన్..జీబీఆర్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకూడదంటే ఒప్పుకోడంటూ తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా కుండ బద్దలు కొట్టారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం ఆదేశిస్తే అదే తాను చేశానని చెప్పుకొచ్చారు. పేదరిక నిర్మూలన.. ప్రజల పక్షమే తన పంతమని పేర్కొన్నారు. తనకు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అది నాయకత్వం నుంచి పిలుపు వచ్చిందన్నారు. కానీ తన వాయిస్ ప్రజల పక్షాన బతికి ఉండాలంటే.. స్వేచ్ఛ ఉన్న పార్టీ తనకు కావాలని పేర్కొన్నారు. తొందరలో తన దారి ఏమిటో నిర్ణయిస్తానని స్పష్టం చేశారు. తనతో కలిసి రవాలంటూ ప్రజలకు ఈ సందర్భంగా గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు.
భారత రాష్ట్ర సమితికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగస్ట్ 4వ తేదీ అంటే సోమవారం రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు పంపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా బాలరాజు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు..