రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లు, దందాలు పెరిగిపోతున్నాయని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఏసీబీ (ACB) ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులతో పలువురు రిజిస్ట్రార్లు, సిబ్బంది ఇరికిపోవడంతో శాఖలో కలకలం రేగింది. ఇదే నేపథ్యంలో శాఖపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు కఠిన చర్యల హెచ్చరికలు జారీ చేశారు.
వనస్థలిపురం ఘటన – సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్ తర్వాత కొత్త వివాదం.
హైదరాబాద్ వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఇటీవల ఏసీబీ దాడుల్లో చిక్కుకోవడంతో, ఆయన స్థానంలో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్ తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించారు.
కానీ బాధ్యతలు స్వీకరించి మూడు రోజులకే, సమీపంలోని జీహెచ్ఎంసీకి చెందిన పార్కును ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి.
స్థానికులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో, ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెంటనే ఆయనను సస్పెండ్ చేసినట్లు సమాచారం.
సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ లంచం కేసు – న్యాయస్థాన సస్పెన్షన్….
ఇక సరూర్‌నగర్‌లో మరో సంఘటనలో, సబ్ రిజిస్ట్రార్ శ్రీలత ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌పై సంతకం చేయడానికే ₹15 లక్షల లంచం కోరిందని బాధితుడు ఆరోపించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం శ్రీలతను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
▶ రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోపణలు: ఇటీవలి నెలల్లో పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరుగుతుండగా,అక్రమ రిజిస్ట్రేషన్లు,ప్రభుత్వ భూములు, ఓపెన్ స్పేసులు, జీహెచ్ఎంసీ ప్రాపర్టీలను వ్యక్తుల పేరిట మార్చడం.భారీ లంచాలు డిమాండ్ చేయడం ,వంటి ఆరోపణలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో బాధితులు, సామాన్య ప్రజలు, రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యక్తులు… “అధికారులపై ఆరోపణలు పెరిగినా సంబంధిత మంత్రిత్వ శాఖ నుండి ఇప్పటివరకు గణనీయమైన చర్యలు కనిపించడం లేదు” అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
▶ “ఇకపై చిన్న ఫిర్యాదు వచ్చినా కఠిన చర్యలు తప్పవు” – ఐజీ హెచ్చరిక
తీవ్ర విమర్శల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు అత్యున్నత అధికారులతో సమావేశమై, శాఖలో నెలకొన్న వ్యవస్థాగత అవినీతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు:
“ఎంత చిన్న ఫిర్యాదు వచ్చినా నిర్లక్ష్యం చేయము”.
“సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాం”.
“రిజిస్ట్రేషన్ శాఖలో శుభ్రపరిచే కార్యక్రమం తప్పదు”.







